PawanKalyan-Tirumala: తిరుమల లడ్డూ వివాదం అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు ఉపయోగించారని తెలిసి భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని టీటీడీ పాలకమండలి కల్తీ నెయ్యి ఉపయోగించిందని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ ఇమ్మనేని రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కల్తీ నెయ్యితో తయారుచేసిన లడ్డూలను శ్రీవారి భక్తులకే కాదు.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా పంపిణీ చేశారని పవన్ కల్యాణ్ తిరుపతి వారాహి సభలో తెలిపారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీ కోసం జంతువులు కొవ్వు కలిపారని అనడం దారుణమని తెలిపారు. పవన్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచామన్నారు. అలాగే లడ్డూ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానెళ్ల నుంచి కామెంట్లను తొలగించాలి అని పిటిషనర్ కోర్టును కోరారు.
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి వై.రేణుకతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నవంబర్ 22వ తేదీన పవన్ కళ్యాణ్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీచేసింది. అయితే కోర్టు సమన్లుపై పవన్ స్పందించాల్సి ఉంది. కాగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు కల్తీకి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమించింది.