CM Chandrababu| రాజధాని అమరావతి పనులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తామన్నారు. డిసెంబర్ నుంచి హైస్పీడ్‌లో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎన్జీవో, ఆలిండియా సర్వీసెస్ (All India Services) భవనాలు 9 నెలల్లో పూర్తి చేస్తామని.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులను 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలిపారు. అలాగే గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణాలు కూడా 9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. టీమ్ లీడర్‌గా ముందుండి పనిచేస్తానని.. తనతో కలిసి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరావతి నిర్మాణం పూర్తి అయి ఉంటే ఇప్పటికే ఏడాదికి రూ.10 నుంచి రూ.15వేల కోట్లు ఆదాయం వచ్చేవన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో విలువైన సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే ప్రారంభమైందని.. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా తానే వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ మళ్లీ గెలిపిస్తారని చెప్పుకొచ్చారు.