రాష్ట్రంలో ఖాళీగా ఉన్న6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(డిఎస్సి)ని నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.ఈమేరకు బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎపి టెట్ మరియు డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూలను విడుదల చేశారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాలు కింద ఉన్న అనగా జిల్లా పరిషత్,మండల పరిషత్,మున్సిపల్,ఎపి మోడల్ స్కూల్స్,ఎపి రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్ సొసైటి,ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ,(గురుకులం),ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(ఆశ్రమ్),ఎపి సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసేటీ,మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వాటిలో ఎస్జిటి 2వేల 280 ఖాళీలు,స్కూల్ అసిస్టెంట్ 2వేల 299,టిజిటి 1264,పిజిటి 215, ప్రిన్సిపల్స్ 42 ఖాళీలు కలిపి మొత్తం 6వేల 100 పోస్టులను డిఎస్సి 2024 ద్వారా భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ 14వేల 219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని వివరించారు.వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ రానున్న డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు స్పష్టం చేశారు.అంతే గాక జీరో వేకెన్సీ అనే విధానంతో ఖాళీలన్నిటినీ భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు.
ఎపి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఎపిటెట్)కు సంబంధించి ఈనెల 8న నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 27 నుండి మార్చి 9 వరకూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి)విధానంలో పరీక్షలు నిర్వహించి మార్చి 14న ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.అదే విధంగా డిఎస్సికి సంబంధించి ఈనెల 12న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని,మార్చి 15 నుండి 30 వరకూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో పరీక్షలు నిర్వహించి ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్నతెలుగు అభ్యర్దుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈపరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని కేంద్రాలతో పాటు హైదరాబాదు,బెంగుళూరు, చెన్నై,బరంపురంల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేగాక పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే స్వేఛ్ఛ కూడా అభ్యర్ధులకే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.డిఎస్సిలో ఎంపికైన వారికి జూన్ లో ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఈప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని ఈఐదేళ్ళలో విద్యపై 73 వేల కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.వారం రోజుల క్రితం ఐబితో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ ఎపి టెట్,డిఎస్సి 2024 షెడ్యూల్ వివరాలు వివరించారు.జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రిజర్వేషన్లతో సహా నోటిఫికేషన్లో పొందుపర్చడం జరుగుతుందని పేర్కొన్నారు.ఉపాధ్యాయులకు టెక్నాలజీ లెడ్ టెస్టింగ్ ట్రైనింగ్ కార్యాక్రమాలను నిర్వహించడం జరుగుతుందని,అదే విధంగా ఆంగ్లమాద్యంపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ టెట్,డిఎస్సి పరీక్షల నిర్వహణపై ఫిర్యాదుల నివృత్తికి ఈనెల 8వ తేదీ నుండి విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జెడిలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, ప్రతాప రెడ్డి పాల్గొన్నారు.