నరసరావుపేట టీడీపీ ఎంపీ, లోక్ సభ టీడీపీ పక్షనేత లావు శ్రీ కృష్ణ దేవరాయలుకు(Lavu Sri Krishna Devarayalu) భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాం అక్రమాల గురించి కృష్ణ దేవరాయలు లోక్ సభలో ప్రస్తావించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దీంతో కృష్ణ దేవరాయలుపై వైసీపీ శ్రేణులు దాడులు చేసే ప్రమాదం ఉందని.. ఇందుకోసం కొంతమంది వైసీపీ నేతలు క్యాడర్‌ను రెచ్చగొడుతున్నట్లు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయనకు భద్రత పెంచాలని హెచ్చరించినట్లు సమాచారం. అలాగే ఢిల్లీలో కూడా ఆయనకు భద్రతను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా తనపై ఏసీబీ కేసు నమోదు వెనక కృష్ణదేవరాయలు ఉన్నారంటూ మాజీ మంత్రి విడదల రజనీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు ఆయన ఘాటుగా బదులు ఇవ్వడం జరిగింది. మీరు మొదలుపెట్టారు తాను ముందుతీసుకెళ్తానని వార్నింగ్ ఇవ్వడం.. ఆ వెంటనే లోక్‌సభలో లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించడం.. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు వైసీపీ పెద్దలను కలవరపాటుకు గురిచేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.