Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan says he is surprised on election results: ఎన్నికల ఫలితాలు చాలా...

Jagan says he is surprised on election results: ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ-పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్ధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడిన వైయస్‌.జగన్‌.

ఈ రోజు నేను మీ అందరితో కూడా నా మనసునుంచి వచ్చిన విషయాలును పంచుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలావచ్చాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం.
ఎందుకంటే ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మనలో ప్రతి ఒక్కరూ తలెత్తుకునే విధంగా పాలన చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో 99శాతం హామీలను అమలు చేశాం. ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టోని తీసుకుని పోయి వారికే మేనిఫెస్టో ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతి గడపకూ తిరిగాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవ్వరూ ఎప్పుడూ తీసుకోలేదు.
ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి, పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్‌ చేసి… ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు మనంచూశాం.

మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయాల వరకూ కూడా మేనిఫెస్టోలు పెట్టుకుని ఆ దిశగా పనులు చేశాం.
ప్రతి డిపార్ట్‌మెంట్లో కూడా హెచ్‌ఓడీల కార్యాలయాల్లో మన మేనిఫెస్టో పెట్టి.. అదే అజెండాగా పాలన చేశాం. వారందరినీ మొట్ట మొదటి రోజునుంచీ సమాయాత్తం చేసి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి.. తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కాని ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఎప్పుడూ చూడని విధంగా… ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ఆ పథకానికి సంబంధించిన క్యాలెండర్‌ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు.

ఒక్కోసారి ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి అని అనిపిస్తుంది. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు పెన్షన్‌ కేవలం రూ.వేయి అయితే మనం దాన్ని ఏకంగా దాన్ని రూ.3వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షనర్లు ఉంటే దాన్ని మనం దాన్ని 66 పెన్షన్లకు పెంచాం. ఎవ్వరినీకూడా పక్కనపెట్టలేదు. ఏకంగా 66 లక్షల మందికి ఇంటివద్దకే వెళ్లి, వారి చేతికే అందించాం. వాళ్ల ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు..వితంతు అక్కచెల్లెమ్మలు వారి ఆప్యాయతలు, ప్రేమలు ఏమయ్యాయి?

54 లక్షలమంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. పిల్లలు గొప్పగా చదవాలి, వారికి మంచి భవిష్యత్‌ ఉండాలని అమ్మఒడి ఇచ్చాం. వాళ్ల ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.
ఏకంగా 53.58 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయ రంగంల ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు?
ఏకంగా 1.5 కోట్ల మంది పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలు అప్పులతో కుదేలైన పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ ఆసరా కార్యాక్రమం ఇచ్చాం.
27 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం. 30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా, వసతిదీవెన వారి తల్లులకే ఇచ్చాం. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.
22 లక్షల ఇళ్లు గతంలో ఎప్పుడూ చూడని విధంగా నిర్మించాం. 3.60 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు కాపునేస్తం, 4.96 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, 82వేల మందికి నేతన్న నేస్తం, 2.76 లక్షల మంది వాహనమిత్రి, 16 లక్షలమందిని తోడు అనే కార్యక్రమం ద్వారా ఆదుకున్నాం. 3.38 లక్షల మందికి చేదోడు, 1.10 లక్షల మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా క్రమం తప్పకుండా ఇచ్చాం. కోవిడ్‌లాంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా సాకులు చెప్పకుండా మంచి చేశాం. ఎప్పుడూ జరగని విధంగా పేదవాడిని ఆ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి. క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి మొత్తం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం. మూడోతరగతి పిల్లలకు టోఫెల్‌ పీరియడ్, ఇంగ్లిషు మీడియం బడులు, ఆరోతరగతి నుంచే ఐఎఫ్‌పీలు, 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇలా ఎన్నో మార్పులు తీసుకు వచ్చాం. వైద్యరంగంలోకూడా సమూల మార్పులు తీసుకు వచ్చాం. ఏకంగా రూ.25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద వైద్యం ఉచితమని చెప్పాం.
ఆరోగ్య ఆసరా నుంచి గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం. ఏకంగా 54 వేలమంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాం. వ్యవసాయంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ఆర్బీకేల ద్వారా పేదలకు తోడుగా ఉన్నాం.

విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్ధాయిలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని అర్థం తీసుకు వచ్చాం. లంచాలు, వివక్షలేని పాలన ఇవ్వగలుగుతారా? అన్నది ప్రశ్నగా ఉన్న పరిస్ధితుల్లో లేదు కచ్చితంగా లంచాలు, వివక్ష లేని పాలన సాధ్యమేని ఈ ఐదు సంవత్సరాల పాలనలో చూపించాం.

ఇంటివద్దకే పాలన అన్న దానికి అర్థం తీసుకు వచ్చాం. ప్రతి పథకం డోర్‌ డెలివరీ చేశాం. మహిళా సాధికారితకు ఏం చేయొచ్చో అన్నీచేశాం. ఇవన్నీ సంస్కరణలు.

అక్కచెల్లెమ్మలు బయటకు ధైర్యంగా వెళ్లే పరిస్ధితిని కల్పించాం. దిశ యాప్‌ద్వారా మహిళల భద్రత దిశగా గట్టి చర్యలు తీసుకున్నాం. గ్రామంలోనే మహిళా పోలీసు ఏర్పాటు చేశాం.
గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మార్పులు జరగలేదు. ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇవేవీ చేయకపోయి ఉంటే… చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నామనేదానికి అర్ధం ఉండేది. ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత.. ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది.
శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాని, ఆధారాలు లేకుండా మాట్లాడలేం.
ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40 శాతం ఓటు షేర్‌తో ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో మనకు 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి 2024లో 10 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ప్రజలు మళ్లీ 2029 వచ్చేసరికి చంద్రబాబు మోసాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మనల్ని తెచ్చుకుంటారు.

ఇవ్వాళ్టికీ కూడా మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఈరోజు కూడా ప్రతి గడపలోనూ మనంచేసిన మంచి కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికీ, ప్రతి ఇంటికీ మనం చేసిన మంచేమిటో తెలుసు. మనం చేసిన మంచి ఎప్పటికీ మనకు శ్రీరామరక్షే. విశ్వసనీయతకు మన పార్టీ చిరునామా. జగన్‌ మాట తప్పుడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్ధం చెబుతూ మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు.

నేను గర్వంగా చెబుతున్నాను. ఈరోజుకీ జగన్‌ అబద్ధాలు చెప్పడు. జగన్‌ మోసం చేయడు. చంద్రబాబుకన్నా.. ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా మందికి అనిపించొచ్చు కూడా?
రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్‌ ఉండడం అవసరమా? అనుకునేవాళ్లు ఉండొచ్చు. కానీ ఒక్కటే చెబుతున్నాను. ఓడిపోయినా ఫర్వాలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ధర్మం, న్యాయం కాదనే జగన్‌ ఎప్పుడూ నమ్ముతాడు.


2014లో కూడా ఇదే నమ్మాను. సాధ్యం కానిది సాధ్యం కాదనే చెప్పాను. చంద్రబాబు వ్యవసాయరుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి.. 2019 నాటికి చేయకపోవడం వల్ల ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారు.
ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు.
మళ్లీ ఈ రోజు కూడా ప్రజలు అదే చేస్తారు.
ఏ స్దాయిలో మనల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అంటే … చంద్రబాబు నాయుడుకి సింగిల్‌ డిజిట్‌ వచ్చే పరిస్థితులు కూడా చూస్తాం. ఇది వాస్తవం.
ఈ రోజు మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు.ఈ రోజు నేను చెప్తున్నాను.. జగన్‌కు వయసు, వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ, ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైయస్సార్‌సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు.
ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు కూడా చేస్తాం. ప్రజలకు మళ్లీ దగ్గరయ్యే కార్యక్రమాలు, వారికి తోడుగా ఉంటూ, వారి తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే అసెంబ్లీలో
మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం చేసేది తక్కువే.

ఏకంగా స్పీకర్‌ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ఒకరు
జగన్‌ ఓడిపోయాడు.. చనిపోలేదు అని అంటారు.
చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడు స్పీకర్‌ పదవిలోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. కానీ
పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతూనే ఉన్నాయి.

కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా.. ప్రతి పథకాన్ని మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌ డోర్‌డెలివరీ చేశారు.
కానీ ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వారి ఆస్తులను దాడులు చేస్తున్నారు.
ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే…
శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు.

మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు రెడ్‌ బుక్స్‌ అని హోర్డింగులు పెడుతున్నారు. ఆ రెడ్‌బుక్‌లో ఏ అధికారిపై కక్ష సాధించాలి, ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిని నాశనం చేయాలని, ఎవరిపై కక్ష సాధించాలని ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు. వాళ్లను కొడతాం, చంపుతాం అని నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశిపాలుని పాపాలు మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయి.

మొట్టమొదటి సారిగా కేంద్రంలో మెజారిటీ రావాలంటే 273 స్థానాలు కావాల్సి ఉండగా, బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది.
మరోవైపు చంద్రబాబుకు 16 స్థానాలు ఉన్నాయి.
చంద్రబాబు ఎన్డీయేలో తాను చక్రం తిప్పుతున్నట్టుగా మోడీ పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునేదిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలా అడగలేని మనిషి రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెప్తాడు.

అదే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పాలన, జగన్‌ఉండి ఉంటే.. ఈపాటికే విద్యాదీవెన ఇచ్చేవాళ్లం. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన బటన్‌ నొక్కేవాళ్లం. ఇవి పెండింగులో ఉన్నాయి.
రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్‌. చివరకి చిన్న అమౌంట్‌ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌. ఒక్క జగన్‌ తప్పుకోవడంతో, ఒక్క వైయస్సార్‌సీపీ పాలన లేకపోవడంతో వీరికి ఏమీ రావడంలేదు. ఇదే అంటుకుంటూ పోతుంది. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

4.12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. రూ. 1500 లు ప్రతి ఒక్కరికీ ఇస్తానని చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. రూ.20 వేల పెట్టుబడి సహాయంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దాదాపు కోటి మంది పిల్లలు అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ అడుగులు ఏవీకూడా ముందుకుపడని పరిస్థితి. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్‌ పీరియడ్‌ ముగుస్తుంది.

ఓడిపోయామన్న భావనను మనసులోనుంచి తీసేయండి.
మనం ఓడిపోలేదు అన్న విషయాన్ని గుర్తించండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది.
ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజలమధ్య గౌరవంగా వెళ్లగలుగుతాం. కేవలం చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్ధితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం జరిగింది. ఆ మోసాలు ఎప్పుడైతే.. తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది.. మన పట్ల అభిమానమూ వ్యక్తం అవుతుంది. మళ్లీ మనం రికార్డు మెజార్టీలతో గెలుస్తాం. ప్రజల మీద కోప్పడాల్సిన అవసరం లేదు. మోసపోతున్నవారికి మనం అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని.

వీరితో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి. వారితో మాట్లాడండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీమీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి పెట్టండి. నాలుగేళ్లవరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే.. చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీకూడా మనవాళ్లకు మనం చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా ధైర్యం వస్తుంది. ఈ కార్యక్రమం జరగాలి. ఇది మీ తరపున కచ్చితంగా చేయాలి.

కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి.
ఎప్పుడూ చూడవని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. పార్టీకి ఓటు వేయలేదని… మనకు ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతున్నాయి.
కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చూశాం. మీ అందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను.. ఇలా దాడులకు గురైన
వాళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలి. మీ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి. వారిని పరామర్శించండి. భరోసా కల్పించండి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం.పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందించండి.

రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ వాళ్ల ఇంటికి వచ్చి కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను. మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కేండిడేట్‌ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవచ్చు. ప్రతి కార్యకర్తకూ తోడుగా ఉందాం. భరోసా ఇద్దాం. ఇది అవసరం.
కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతో నిలబడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. జెండాలు మోసి కష్టాలు పడ్డారు.
వారికి తోడుగా నిలవాలి. సోషల్‌ మీడియా కార్యకర్తలను, పార్టీ కార్యకర్తలను మనకోసం నిలబడ్డ వాలంటీర్లను వీరందర్నీకూడా కాపాడుకోవాలి. గ్రామస్ధాయిలో మన పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరినీ మనం కాపాడుకోవాలి. వీరికి తోడుగా ఉండే కార్యక్రమాలు జరగాలి.

మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షలమంది కార్యకర్తలు, వేలమంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు.
మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా కూడా నష్టపోతారు. మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతి అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కేవలం ఇంటర్వెల్‌ మాత్రమే. కౌరవులు పాండవులు మధ్య యుద్ధం గమనిస్తే.. శకుని పాచికలు ఈ అంశంలో శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు.
చివరకు ఎప్పుడైనా ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయి. మనం ధర్మం వైపే ఉన్నాం. విశ్వసనీతతో రాజకీయాలు చేశాం. తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతి ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. పైన దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రజలను, దేవుడ్ని నమ్ముకున్నాం. ధైర్యంగా అడుగులు వేస్తాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News