Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైఎస్ఆర్సిపి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Katasani: వైఎస్ఆర్సిపి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

ప్రజల్లోకి విస్తృతంగా వై ఏపీ నీడ్స్ జగన్

‘ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే’.. అనే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం గురువారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అన్న ప్రధాన అంశంతో ఆయా నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామంలో ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు తెలియజేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీ నుండి శ్రీకారం చుట్టామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే ఒక వినూత్న కార్యక్రమానికి నేటి నుండి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో ఆయా గ్రామాలలో మండల అధ్యక్షులు, మండల నాయకులతో కలిసి సంబంధిత సచివాలయాల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ, అలాగే అర్హత ఉండి పథకాలు రానివారికి పథకాలు అందేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 2014-19 కాలంలో తెలుగు దేశం పార్టీ,చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేర్చాడు, నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేర్చాడు అనే అంశాలను, అలాగే రెండు పార్టీల మధ్య ఉన్న తారతమ్య భేదాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హమీని నెరవేర్చ లేదని, ఆ మేనిఫెస్టోను ప్రజలకు కనిపించకుండా వెబ్సైట్ నుంచి తొలగించారని ప్రజలు తెలుసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ… వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో దశలవారీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనలో అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ, అలాగే గ్రామాల వారీగా పొందిన లబ్ధి వాటి వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గ్రామాలలో ఒక పండుగ లా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎంగా అధికారం చేపట్టాలని అందుకుగాను వైఎస్ఆర్సిపి నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని, అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాల కాలంలో నెరవేర్చిన హామీలు, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వైఎస్ఆర్సిపి నాయకులు వివరించాలని తెలిపారు.

గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు తెలియజేస్తూ స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఒక మంచి తరుణం అన్నారు. అలాగే గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంత అభివృద్ధికి 20 లక్షల నిధులను కేటాయించామన్నారు. ఎల్లో మీడియా చేస్తున్న అసత్యపు ప్రచారాలను పటాపంచలు చేసి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడం మన కర్తవ్యం అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం మాత్రమే కాదని అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను తిప్పికొడుతూ గత 67 రోజుల నుండి నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ… ఇది అభివృద్ధి కాదా అని తెలుపుతూ వారికి దీటైన సమాధానం ఇస్తున్నామన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల ముంగిట ఉంచిన మేనిఫెస్టోను అందులో తెలిపిన అంశాలను అన్నింటిని నెరవేర్చామని, నేడు ఆ మేనిఫెస్టోను తీసుకొని ప్రజల వద్దకు ధైర్యంగా వెళుతున్నామన్నారు. అదే టిడిపి వారు నాడు ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో ను తీసుకొని ప్రజల మధ్యకు వెళ్లే దమ్ముందా టీడీపీ నాయకులకు ఉందా అంటూ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నాయన్నారు. వీటన్నింటిని ప్రజలు గమనించాలని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ జెడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పామ్ షావలి, కౌన్సిలర్ సమ్మద్, వైఎస్ఆర్సిపి నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, బుగ్గరపు నాగరాజు, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News