రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.జి. సృజన రహదారి అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ ఓర్వకల్లు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్హెచ్ 40 అధికారులను ఆదేశించారు. సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద పూర్తి స్థాయిలో ఐరన్ బ్యారికేడింగ్ లేకపోవడం వల్ల ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ దృష్టికి డీఎస్పీ, డిటిసి తెలుపగా అందుకు ఎన్హెచ్ 44 అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరణ ఇస్తూ పూర్తి స్థాయిలో ఐరన్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్న వారు వాటిని తొలగించి రోడ్డును వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ కు తెలుపగా ప్రజల క్షేమమే మనకు ముఖ్యమని అందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే ఐరన్ బ్యారికేడింగ్ తొలగించారో పూర్తి చేసి దానికి సంబంధించిన కంప్లయన్స్ రిపోర్టుతో పాటు ఫోటోలను జతచేసి అందజేయాలని, ఏర్పాటు చేసిన ఐరన్ బ్యారికేడింగ్స్ ను ఇతరులు తొలగించకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా స్థాయిలో నెలకు ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే రహదారి భద్రతా సమావేశాలకు నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలా కాక వారు ఎక్కడో ఉండి వారి ప్రతినిధులను సమావేశానికి పంపడం సరైన పద్ధతి కాదని వారు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇంత వరకూ జిల్లాలో ఎన్ని రహదారి భద్రతా సమావేశాలు నిర్వహించారని, ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారని, వారు హాజరు కాకపోవడం వల్ల పరిష్కారం కాని పనులతో వాటి వల్ల జరిగిన ప్రమాదాలను వివరిస్తూ తనకు నివేదిక పంపాలని కలెక్టర్ డిటిని ఆదేశించారు. అదే విధంగా ఎన్హెచ్ లలో ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను ఒక వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ బళ్లారి చౌరస్తా జంక్షన్ పరిసరాల్లో సర్వీసు రోడ్డు చాలా తక్కువగా ఉందని, అందులో ముందుగా హైదరాబాద్ వైపు ఫ్రీ లెఫ్ట్ వెళ్లడానికి ఏర్పాటు చేశామని, కోడుమూరు వైపు ఉన్న రోడ్డుకు కూడా టిడిఆర్ ఇచ్చామని త్వరలో బిటి రోడ్డు కూడా వేస్తామని, అదే విధంగా బస్ బేస్ కు సంబంధించి రేష్నలైజేషన్ చేయాలని, చాలా వరకు నిరుపయోగంగా ఉన్న వాటిని రేష్నలైజేషన్ చేసి అవసరం ఉన్న చోట నిర్మిస్తామని, రోడ్డు వైడనింగ్ కు సంబంధించి ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నామని, బిర్లా గేట్, వినాయక్ ఘాట్ వద్ద ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగిస్తున్నామన్నారు, నగరంలో వంద వరకు సిసి కెమెరాలు ఉన్నాయని వాటిలో 65 వరకు మరమ్మత్తులు చేశామని,మిగతా వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా నగరంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
తొలుత రహదారి భద్రతకు సంబంధించిన నివేదికను డిటిసి శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం, ఆర్టీఓ రమేష్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, డిఎంహెచ్ఓ రామ గిడ్డయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ నరేంద్రనాథ్, పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాసులు, ఆర్టీసి అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.