అటల్ పెన్షన్ యోజన పథకానికి 53,913 మంది లబ్ధిదారులని చేర్పించడం ద్వారా కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించిందని కమిషనర్ భార్గవ తేజ తెలిపారు. జిల్లాలో బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కర్నూల్ మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ బ్యాంక్ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ లోని మినీ మీటింగ్ హాల్లో మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా బ్యాంక్ అధికారులతో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్టిక్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని అందుకు సంబంధించిన అర్హత పొందిన లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రవేశపెట్టిన జగనన్న తోడు, జగనన్న బడుగు వికాసం, పీఎంఈజీపి, పీఎంఎంఏవై, స్టాండప్ ఇండియా, పథకాల సంబంధించి అర్హత ఉన్నవారికి యువ పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చేలా అవకాశం కల్పించాలని తెలియజేశారు.
టిడ్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే మార్ట్ గేజ్ డాక్యుమెంట్ సదుపాయం ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కమిషనర్ కోరారు. కెనరా బ్యాంక్ వారి సహకారంతో సెల్ ఫోన్ రిపేర్లు సర్వీసు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ద్విచక్ర వాహనాల రిపేరు, మోటార్ వైన్డింగ్, సీసీటీవీ సర్వీసింగ్ మొదలగు శిక్షణ కార్యక్రమాలు పొందిన యువత వారు ఇచ్చు సర్టిఫికెట్లను బ్యాంకు కు సమర్పించి వారి చేత రుణాలు పొంది స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ చంద్ర రావు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి సంబంధించి ₹4,550.92 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2739.58 కోట్లు మంజూరు చేసినట్లు, ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి 40.33 శాతం గా ఉంది అని తెలియజేశారు. ఇందులో పంట రుణాలకు సంబంధించి 2050.24 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు తెలియజేశారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు నిర్దేశించిన 2082.59 కోట్ల లక్ష్యానికి గానున 806.96 కోట్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగానికి సంబంధించి 3641.72 కోట్లు మంజూరు చేసినట్లు ఇది నిర్దేశించిన లక్ష్యానికి 36.20%గా ఉంది అని తెలియజేశారు. రాబోయే మూడు త్రైమాసికాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని జిల్లా బ్యాంకు అధికారులకు లీడ్ బ్యాంకు మేనేజర్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పథకాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ తెలియజేశారు. పెండింగ్లో ఉన్న పీఎం స్వా నిధి, మరియు టిడ్కో రుణాలు త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను మంజూరు చేశామని, జిల్లాలో ఉన్న బ్యాంకు అధికారులు సిసిఆర్సి కార్డులు ఉన్న రైతులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ ఏపీ రావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్ ఆఫీసర్ నాగప్రవీణ్, వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు మరియు అన్ని బ్యాంకుల జిల్లా అధికారులు పాల్గొన్నారు.