Landslides at srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో రోప్‌వే ద్వారా పాతాళ గంగకు రాకపోకలు నిలిచిపివేసినట్టుగా అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన పోలీసులు జేసీబీ సాయంతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగిస్తున్నారు. శ్రీశైలం పాతాళ గంగ వద్ద కొండచరియలు విరిగి పడడం ఈ వారంలో ఇది రెండో సారి కావడంతో.. భక్తులు భయాందోళనకు గురౌతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రజలకు కీలక సూచన: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే యానాం ప్రాంతంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/today-ap-weather-forecast-updats/
ఉరుములతో కూడిన భారీ వర్షాలు: రాబోయే రెండు మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


