Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Madhavrao Desai: వర్షాభావంతో రైతన్న ఇక్కట్లు-ప్రభుత్వ సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు

Madhavrao Desai: వర్షాభావంతో రైతన్న ఇక్కట్లు-ప్రభుత్వ సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు

రాష్ట్రంలో రైతన్నలు వర్షాభావంతో ఇక్కట్లు పడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని కావున తక్షణమే ప్రభుత్వం అధికారులతో వర్షాభావ ప్రాంతాలపై పరివేక్షణ నిర్వహించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులచే నివేదికలు తెప్పించుకొని రాష్ట్రంలోని వర్షాభావ ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావ్ దేశాయ్ డిమాండ్ చేశారు. నందవరం మండల పరిధిలోని పంట పొలాలను పరిశీలించి వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పలు పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాతల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

రైతులు తమ గోడును వారికి విన్నవించుకుంటూ… నెలన్నర క్రితం వచ్చిన మొదటి వర్షానికి పంట పొలాలను సాగుచేసుకొని విత్తనాలు వేసుకున్నామని కాని మరల అప్పటినుండి ఇప్పటివరకు వర్షమే రాకపోవడంతో మొలకెత్తిన పంటపైర్లు ఎండ తీవ్రతకు పైరు మొత్తం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రతి రైతు ఒక ఎకరాకు పది నుండి పదిహేను వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని మరలా ఇప్పుడు వర్షం వచ్చినా ఈ పంటలు పండే పరిస్థితిలో లేవని కావున ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని లేకపోతే దేశానికి అన్నం పెట్టే రైతన్న పొట్టకూటి కోసం పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాధవరావ్ దేశాయ్ మాట్లాడుతూ ..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే వైసిపి ప్రభుత్వం వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడాన్ని విస్మరించి అధికార కాంక్షతో రానున్న ఎన్నికలలో మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రతిపక్షాల పతనం కోసం కుటిల రాజకీయ కుతంత్రాలను పన్నుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతే రాజు అని చెప్పుకునే భారత దేశంలో ఆ రైతే నేడు పట్టెడు మెతుకుల కోసం ప్రభుత్వాల వైపు ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితిని మన ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఈ దయనీయ పరిస్థితిని రూపుమాపాలంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, వ్యవసాయానికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు అందించి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయంలో శిక్షణ కల్పించి అధిక దిగుబడును తెచ్చే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా పండించిన పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని వారు సూచించారు.

గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసం ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులను దారి మళ్లించడమే కాకుండా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన జీతాలను కూడా సకాలంలో చెల్లించకుండా దారి మళ్లించి నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులను అటకెక్కించి రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని, అంతేకాకుండా నిత్యవసర ధరల పెంపు, పన్నుల పెంపుతో సామాన్య ప్రజలు నడ్డి విరుస్తూ పేదవాడిని మరింత పేదవాడిగా చేస్తున్నాడని వారు విమర్శించారు. కావున ప్రజలు వీటిని గమనించి రానున్న రోజులలో ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాక్షేమం, రాష్ట్ర పురోగతి, అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాలనే ఏర్పాటు చేసుకోవాలని వారు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు మల్లికార్జున, వెంకటేష్, శ్రీనివాసులు, పంపయ్య, చాంద్ బాషా, వలి, కొత్తపల్లి వీరేష్ గౌడ్, నరసింహులు, ఆనంద్, అంజి, వడ్డగిరి నరసింహులు, రైతు సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News