Nagababu| తనకు రాజ్యసభ సీటు విషయంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో చర్చించారనే వార్తపై నాగబాబు స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
“అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు” అని నాగబాబు రాసుకొచ్చారు.
కాగా ఇటీవల మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారితో చర్చించారు. అయితే త్వరలోనే ఎన్నిక కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థానాన్ని తన సోదరుడు నాగబాబుకు కేటాయించేందుకే పవన్ మంతనాలు జరిపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.