Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నకిలీ విత్తనాలా ? పీచమణుస్తాం

Nandyala: నకిలీ విత్తనాలా ? పీచమణుస్తాం

నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టే అంశాన్ని సీరియస్ గా తీసుకొని ప్రత్యేక దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ చైర్పర్సన్ పి.పి. నాగిరెడ్డి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణను వ్యవసాయ అధికారులు సీరియస్ గా తీసుకుని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత దుకాణాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 20 మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు సాగుకు ముందే సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వేసుకున్న ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేయడంతోపాటు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించే పంటలపై అవగాహన కల్పించాలన్నారు. పిఎం కిసాన్ కింద పెండింగులో వుండి అర్హత కలిగిన 29,764 మంది రైతుల ఈ కేవైసీ ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచి పంట ఉత్పత్తులపై పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను సూచించారు. పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వుండాలన్నారు. వైయస్సార్ పశుభీమా పథకం కింద పశువులు, మేకలు గొర్రెలకు బీమా వర్తించే తరహాలోనే ఎద్దులకు కూడా వర్తించే విధంగా వచ్చేనెల నుండి ప్రారంభించనున్నారని చైర్మన్ తెలిపారు. మొత్తం ప్రీమియంలో 80% ప్రభుత్వం భరిస్తుండగా ఉన్న 20 శాతం లబ్ధిదారుల వాటాగా ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో అన్ని బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణను సూచించారు. నంద్యాల ప్రాంతంలో 55 నర్సరీలు వున్నాయని సంబంధిత నర్సరీల్లో నకిలీ విత్తనాల విక్రయ ప్రక్రియను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారిని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి మోహన్ రావు, ఇరిగేషన్, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు,ఏపీఎంఐపీ, మార్కెటింగ్, ఏపీఎంఐపీ, తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News