తప్పుడు వార్తలు పదేపదే రాసి అది నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా సాక్షిపై న్యాయ పోరాటం చేస్తున్నానని.. ఆలస్యమైనా నిజం గెలుస్తుందన్నారు.
ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని తన తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని చెప్పారు. ఇప్పుడు కూడా మంత్రి హోదాలో వచ్చినా పార్టీ ఆఫీసులోని బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానని పేర్కొన్నారు. సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నానని.. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతానని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత జగన్(Jagan)ను ఆ పార్టీ నేతలు నమ్మడం లేదని.. అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని తెలిపారు. తమ పార్టీని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన విజయసాయి రెడ్డిని టీడీపీలోకి ఎందుకు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో ఆయన చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. చట్టం ఉల్లంఘించిన ప్రవర్తించిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని మరోసారి లోకేశ్ స్పష్టం చేశారు.