కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని అప్పర్ భద్ర నిర్మాణానికి నిరసన తెలుపుతూ నందవరం మండల పరిధిలోనే రాయలసీమ స్టీరింగ్ కమిటీ, రాయలసీమ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కనక వీడు, మిట్ట సోమాపురం, కనుకవీడు పేట, నాగలదిన్నె, నందవరం, మగతి మాచాపురం తదితర గ్రామాల్లో విస్తృతంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు కృష్ణ నాగన్న, నల్లారెడ్డి, ఖాజా మాట్లాడుతూ పాలకుల చేతిలో తరతరాలుగా రాయలసీమ మోసపోతూనే ఉందని, అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రులు సీమ ప్రాంత వాసులే ఉన్న రాయలసీమకు మాత్రం ఒరిగింది ఏమీ లేదని. దశాబ్దాల క్రితం విజయనగర రాజులు తవ్వించిన చెరువులు, బ్రిటిష్ వారి కాలం నాటి కాలువలు తప్పితే రాయలసీమకు సరైన నీటి ప్రాజెక్టులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీమ వాసులు ఎన్నాళ్ళ గాను ఎదురుచూస్తున్న ఆర్డీఎస్ ఇంతవరకు పూర్తి చేయకపోవడం దారుణమని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డచందంగా ఇప్పుడు మధ్య కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు వచ్చి తుంగభద్ర జలాలకు ఎసరు పెట్టి రాయలసీమ భవిష్యత్తును ఆందోళనలో పడేసిందని అన్నారు. పాలకులు స్పందించి సంగమేశ్వర వద్ద బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించాలని కృష్ణానది యాజమాన్య బోర్డ్ ను కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, బజారి, కేశవ, రవీంద్ర పాల్గొన్నారు.

