Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Parent-Teacher Home Visit: తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం

Parent-Teacher Home Visit: తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం

బంధాలను బలోపేతం చేసే కార్యక్రమంగా..

తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మధ్య నేర్చుకునే అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఉద్దేశించి “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎపిసోడ్ 16”లో ఆయన కీలక ప్రసంగం చేశారు.

- Advertisement -

ఇటీవల ముగిసిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు సాధించిన సగటు మార్కుల మధ్య ఉన్న వ్యత్యాసంపై ప్రవీణ్ ప్రకాష్ చర్చించారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సగటున 600 మార్కులకు 358 మార్కులు సాధించగా, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 479 మార్కులు సాధించారు, అంటే 121 మార్కుల తేడా ఉందని గమనించామని, ఇదే తేడా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల 12వ తరగతుల విద్యార్థులు సాధించిన మార్కులలో కూడా గమనించానన్నారు. ఫలితాల తీరుపై కళాశాల లెక్చరర్లు హైస్కూల్ ఉపాధ్యాయులను, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను నిందించడంతోపాటు పరస్పర నిందాపూర్వకంగా వ్యాఖ్యానించడం గుర్తించినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ తరహా విధానానికి మూలాల నుంచి చెక్ పెట్టాల్సిన అవసరముందన్నారు.

యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో విజయవంతమైన కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొంది “తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని” ప్రవేశపెట్టినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి రెండుసార్లు తమ విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తారని తెలిపారు.

• జూన్: విద్యా సంవత్సరం ప్రారంభంలో, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి వ్యక్తిగత వార్షిక విద్యా ప్రణాళికను రూపొందిస్తారు.
• జనవరి: అర్ధ సంవత్సర పరీక్షల తరువాత, ఉపాధ్యాయులు మళ్లీ సందర్శించి విద్యార్థుల పురోగతిపై చర్చించి కోర్స్ లో అవసరమైన సవరణలు చేస్తారు.

గృహ సందర్శన కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులతో నమ్మకమైన సంబంధం ఏర్పడి తల్లిదండ్రులను వారి పిల్లల విద్యలో పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తుందని ప్రవీణ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విద్యార్థుల హాజరు, ప్రవర్తన మరియు అభ్యాసంలో మెరుగుదలకు దారితీస్తుందని భావిస్తున్నానన్నారు. విద్యలో కుటుంబ సభ్యుల పాత్రను తెలిపేందుకు ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తుందన్నారు. తల్లిదండ్రులను వారి పిల్లలతో క్రమం తప్పకుండా రాత్రి భోజనాలు చేసే సమయంలో పాఠశాలలో తమ పిల్లల పని తీరు గురించి చర్చించేలా ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా దేశాల నుండి లభించిన డేటా ప్రకారం ఇలాంటి గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల హాజరు 13 శాతం నుండి 24 శాతానికి పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతిలో సాధారణంగా 25-30 మంది విద్యార్థులు ఉండటం వల్ల సంవత్సరానికి 60 సందర్శనలు నిర్వహించడం అదనపు పనిభారంగా గాకుండా, సాధించగలిగిన లక్ష్యంగా భావించి ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. సదరు సందర్శనలు పూర్తైన అనంతరం ఉపాధ్యాయులు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీతో తమ అనుభవాలను 9013133636 మొబైల్ నంబర్ కు సందేశం రూపంలో పంపించవచ్చని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.

“గృహ సందర్శన” తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అభ్యాసకుల మధ్య బంధాలను బలోపేతం చేసే కార్యక్రమంగా భావిస్తున్నామని, కార్యక్రమ లక్ష్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు సంసిద్ధులుగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రవీణ్ ప్రకాష్ పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News