వైసీపీ నేత దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. చాలా కార్యక్రమాలను రద్దు చేసుకొని గాలివీడుకు వచ్చానని.. తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ముఠాలతో భయపెడితే.. తమది భయపడే ప్రభుత్వం కాదని హెచ్చరించారు. అభివృద్ధికి ఎవరు అడ్డుగోడలు కట్టినా బద్దలుగొట్టే శక్తి తమకుందన్నారు. అభివృద్ధి పనులకు ఎంపీపీలు అనుమతులు ఇవ్వకపోతే 14 రోజుల్లో నోటిసు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు పవన్ తెలిపారు.ఎంపీడీవోపై దాడి చేసినవారు ఎక్కడున్నా లాక్కొచ్చి జైల్లో పడేస్తామన్నారు. అలాగే సోషల్ మీడియాలో పిచ్చికూతలు కూసినా తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు.
ఇక తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందించారు. నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలన్నారు. ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే అన్నారు. తనకు పనిచేయడం ఒక్కటే తెలుసు అని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని పవన్ వెల్లడించారు.