Pawan Kalyan| రాజకీయ అనిశ్చితితో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో హిందువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. అక్కడి హిందువులను దారుణంగా హింసిస్తున్నారు. అయితే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కూడా హిందువులపై అణిచివేత ధోరణి ప్రదర్శిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy krishna das)ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు హిందూ ప్రచార బోధకులు కృష్ణదాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు.
తాజాగా ఆయన అరెస్ట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan) కూడా తీవ్రంగా ఖండించారు. దీనిపై కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తనను తీవ్రంగా కలచివేస్తోందని వాపోయారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని.. దేశ వనరులు ఖర్చు కావడంతో పాటు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాలస్తీనాలో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి అంశాలపై ఎందుకు స్పందించరని నిలదీశారు.