ఏపీకి భారత వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. దీంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నుండి శ్రీకాకుళం జిల్లాల వరకూ వరి కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే.. పంటంతా వర్షార్పణమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. అది క్రమంగా పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఆ తర్వాతి రోజుకి అనగా.. డిసెంబర్ 8న అది పుదుచ్చేరి, తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 8,9 తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది. తాజాగా వాతావరణ శాఖ ఏపీకి వర్షసూచన ప్రకటించడంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది. కొందరు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రానికి ఫోన్ చేసి.. వాతావరణ సమాచారం అడగ్గా.. 5న అల్పపీడనం ఏర్పడిన తర్వాత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత రాదని అధికారులు పేర్కొన్నారు. తూర్పుగాలుల ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.