తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25న (సోమవారం) వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు – శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.