NTR Vaidya Seva Trust: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ (NTR Vaidya Seva Trust) అనుబంధ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేసింది.
ఆర్థికమంత్రితో కీలక చర్చలు:
నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల నుంచి బకాయిల చెల్లింపులపై తీవ్ర ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలో, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు.
త్వరలో మరో రూ. 250 కోట్లు!
త్వరలోనే మరో రూ. 250 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు. ఈ తాజా నిధుల విడుదలతో, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆసోసియేషన్ (ASSHA) సహా ఇతర సంఘాల ప్రతినిధులు, ఆసుపత్రి యాజమాన్యాలు వెంటనే తమ ఆందోళనలను విరమించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలను నిరాటంకంగా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం పేద, మధ్యతరగతి రోగులకు ఉపశమనం కలిగించడంతో పాటు, వైద్య ఆరోగ్య వ్యవస్థలో విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


