చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చినప్పుడల్లా తొక్కిసలాట ఘటనలు జరిగి అమాయకులు చనిపోవడం ఆనవాయితీగా మారిందని మాజీ మంత్రి రోజా(Roja) విమర్శించారు. గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోగా, ఇప్పుడు తిరుపతిలో ఆరుగురు బలయ్యారని తెలిపారు. తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటనతో చంద్రబాబు అసమర్థ పాలన మరోసారి బహిర్గతమైందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాల్సింది పోయి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కోరుతూ, టోకెన్ల కోసం వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్న కనీస ఇంగితం ప్రభుత్వానికి లేదన్నారు. తెల్లవారుజామున నుంచే క్యూలైన్లలో నిల్చున్న వారికి భోజనాలు, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, టీటీడీ ఛైర్మన్‌తో పాటు, పాలక మండలి బాధ్యత వహించాలని చెప్పుకొచ్చారు.
హైందవ శంఖారావం నిర్వహించిన పెద్దలంతా ఇప్పుడు బయటకు రావాలన్నారు. తిరుమల లడ్డూ మీద తప్పుడు ప్రచారం జరిగినప్పుడు రైళ్లలో చిడతలు వాయించుకుంటూ వచ్చి హడావుడి చేసిన మాధవీలత వంటి వారు ఇప్పుడెందుకు స్పందించడం లేదన్నారు. సనాతనవాదిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు.