కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్(Free gas Cylinder) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పథకం అమలు చేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 90లక్షల మంది ఉచిత సిలిండర్లు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన నగదును కూడా గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు నేటి నుంచి ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిని ప్రారంభించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31 మధ్య గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి నగదను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసిన 48 గంటల లోపు సిలిండర్ డెలివరీ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారులు చెల్లించిన పూర్తి సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తారు. అర్హత ఉండి ఉచిత గ్యాస్ సిలిండర్ అందనివారు 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.