ఏపీలో ఎండలు(Heat Wave) దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం నుంచే బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. మరోవైపు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 208 మండలాల్లో వడగాలులు, 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజల మొబైళ్లకు ఈమేరకు అప్రమత్త సందేశాన్ని పంపుతోంది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని తెలిపింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలని సూచించింది.
గురువారం 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 42.4 డిగ్రీలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీలు, కర్నూలులో 41.7 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.