ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశలవారీగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిపాలనా విధి విధానాలు అందరికి అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు. ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకొస్తున్నామని.. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నామని అనగాని వెల్లడించారు.
