Speaker Ayyanna Patrudu at Barbados Commonwealth Parliamentary Conference: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బార్బడోస్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు బుధవారం బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లో ఘనంగా ప్రారంభమైంది. 60కిపైగా కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ల నుంచి వచ్చిన సుమారు 180 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు సదస్సులో పాల్గొని భారత పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్రాల శాసనసభ విధానాలు, డిజిటల్ పార్లమెంట్ దిశగా తీసుకుంటున్న చర్యలపై ప్రతినిధులతో పలు ఆలోచనలు పంచుకున్నారు. పలు దేశాల ప్రతినిధులను కలిసి కామన్వెల్త్ దేశాల సమగ్ర అభివృద్ధి, శాంతి, ప్రజాస్వామ్య పరిపాలన బలోపేతం వంటి అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.
అంతకు ముందు బార్బడోస్ అధ్యక్షురాలు సాండ్రా మేసన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్బడోస్ ప్రధానమంత్రి మియా మోట్లే, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ తదితరులు సదస్సుని ఉద్దేశించి ప్రసంగించారు. సదస్సులో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, శాసనసభల మధ్య అనుభవాల పంచుకోవడం, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, యువ శాసనసభ్యుల పాత్ర వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సదస్సు అక్టోబర్ 12 వరకు కొనసాగనుంది. ముగింపు రోజున పాల్గొన్న ప్రతినిధులు కలసి సంయుక్త ప్రసంగాలు, తీర్మానాలను ఆమోదించనున్నారు.


