శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో .. ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదించిన 240 మంది గజ ఈతగాళ్ళు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక టాయిలెట్లు, డ్రెస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డిడిని, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 650 బస్సులు, తెలంగాణా నుండి 180 బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులకు సులభంగా స్వామి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేసినట్టు ఈవో లవన్న వివరించారు. భక్తులకు అందించే స్వామిఅమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను 30 లక్షల వరకు తయారు చేస్తున్నామన్నారు. ఈ నెల 18వతేదీ మహాశివరాత్రిపర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయన్నారు.
బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 లక్షల మందికి పైగా భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున మొబైల్ నెట్ వర్క్ సరిపోయే విధంగా అన్ని సంస్థలు మైక్రో టవర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.