కాకినాడ పోర్టు (Kakinada Port) లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తనిఖీల తర్వాత అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. బియ్యం అక్రమంగా తరలిస్తున్న స్టెల్లా షిప్ ని సీజ్ చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. ఆ ఓడలోని బియ్యం పీడీఎస్ బియ్యమా కాదా? ఎగుమతి చేస్తున్నది ఎవరూ వంటి అంశాలపై విచారణ చేపడతామన్నారు. అందుకోసం ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులు ఈ కమిటీలో ఉండనున్నారు. గోదాము నుంచి కాకినాడ పోర్టు వరకు రేషన్ బియ్యం ఎలా వచ్చాయో ఈ కమిటీ విచారణ చేయనుంది. ప్రతి లోడ్ ని పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో కమిటీ సభ్యులు విచారించనున్నారు. సభ్యుల బృందం తనిఖీలకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోంది. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ ఉందో లేదో కూడా కమిటీ నిర్ధారించనుంది. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం కోసం 7993332244 నంబర్ కి సంప్రదించవచ్చు అని జిల్లా కలెక్టర్ సూచించారు.
కాగా, ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు (Kakinada Port) లో అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోతోందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కీలక చర్చలు జరిపారు. నేడు కేబినెట్ భేటీలో సైతం రేషన్ బియ్యం అక్రమ రవాణా నిర్మూలనపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.