స్వచ్చాంధ్రప్రదేశ్ సామాజిక సేవా కార్యక్రమంలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములు కావాలి. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కోసం ముందుకొచ్చిన లక్షలాదిమందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. గాంధీజీ కలలు కన్న పరిశుభ్రమైన భారతదేశం కోసం మనమంతా పాటుపడదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రతి నెలా 3వ శనివారం
2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని, అది మైదుకూరు నుంచే మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి నెలా మూడో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
సమర్థంగా విధులు నిర్వహించిన వారికి
పరిసరాల పరిశుభ్రత విషమంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. వందనమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి చెత్త నిర్వహణను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.
పారిశుద్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి
2014, అక్టోబర్ 2 న నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు. అదే స్పూర్తితో ముందుకు వెళ్తున్నాము. నేను 1995లోనే పచ్చదనం పరిశుభ్రతకు శ్రీకారం చుట్టాను. పారిశుధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలవిసర్జనకు ముగింపు పలకడం వంటి కార్యక్రమాలు నిర్వహించాము. మన చుట్టుపక్కల ఇంకా పూర్తిస్థాయిలో పరిశుభ్రత లేదు. జపాన్ వంటి దేశాల్లో కాగితం ముక్క కూడా రోడ్డుపై వేయరు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్త ఊడ్చి రోడ్డుపై వేస్తాము. ఇదో అలవాటుగా మారింది.
పాదయాత్రలో చూశా
ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్ర సమయంలో ప్రత్యక్షంగా చూశాను. కొన్ని చోట్ల అపరిశుభ్రత తాండవించేది. ఊరి మొదట్లోనే మరుగుదొడ్లు, చెత్తా, చెదారం దర్శనమిచ్చేవి. మరుగుదొడ్లు లేక పల్లెల్లో ఆడవాళ్లు ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్రలో ఆత్మగౌరవం పేరుతో ప్రతి ఆడబిడ్డకు మరుగుదొడ్లు కట్టించాము. కట్టెల పొయ్యితో వంట చేస్తూ నా తల్లి సహా ఎందరో ఆడబిడ్డలు పడుతున్న కష్టం కళ్లారా చూసి దీపం పథకం ప్రవేశపెట్టాను. దీపం 2 కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము.
స్వచ్ఛ భారత్ కమిటీ కన్వీనర్ గా
2015, ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ దేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలని కమిటీ వేశారు. ఆ కమిటీకి నన్ను కన్వీనర్ గా నియమించారు. ప్రపంచమంతా తిరిగి కొత్త విషయాలు తెలుసుకుని సమగ్ర నివేదిక ఇచ్చాను. దాని ప్రకారం దేశమంతా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వనరుల సమీకరణ, ప్రజల్లో స్పూర్తి నింపడం, సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తులను గౌరవించడం వంటి వాటిపై దృష్టిపెట్టి మంచి ఫలితాలు సాధించాము.
పారిశుధ్య నిర్వహణలో రాజీపడం
కొన్ని తరాలుగా ఆచరించినవే మనకు అలవాటుగా వస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఆలోచన చేయాలి. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మనం పనిచేసే వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రతిఒక్కరూ ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని నిర్ధిష్ట లక్ష్యాలు పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు.
12 నెలలు, 12 థీములు
12 నెలలూ 12థీములు తీసుకున్నట్టు సీఎం వివరించారు. మీలో చైతన్యం తీసుకొస్తాం. మనం పాటిస్తేనే ఎదుటివారు మన మాట వింటారు. పదిమందికి స్పూర్తినిచ్చేలా ఉండాలి. పరిశుభ్రత ఉంటేనే పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు. పిల్లల్లు, పెద్దలు పర్యావరణం, పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి. నూటికి నూరు శాతం వ్యర్థాలు సేకరిస్తాము. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఆ వ్యర్థాలను 100 శాతం శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేస్తాము.తిరిగి ఉపయోగించగల వ్యర్ధ్యాలను రీ సైక్లింగ్ చేస్తాము. ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించారా, లేదా అనేదానిపై మానిటరింగ్ చేస్తాము. చెత్త నుంచి ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ముందుకొస్తే మనం అనుకున్న పని విజయవంతమవుతుంది.
మంచి ఆలోచనలు జీవితాన్నే మార్చేస్తాయి
చెడు ఆలోచనలు రాకుండా మన మైండ్ ని మనమే నియంత్రించుకోవాలి. 2025, అక్టోబర్ 2 నాటికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్ధవంతంగా అమలు చేస్తాము. 2014-19 మధ్య స్వచ్చాంధ్ర ప్రదేశ్ పేరుతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాము. చాలా ఫలితాలు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. నేను మచిలీపట్నంలో పర్యటించినప్పుడు నాలుగు రోడ్లు కలిసే సెంటర్ లో గుట్టలు గుట్టలుగా చెత్త వేయడాన్ని గమనించాను. దాని వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
గాంధీ జయంతి నాటికి
అక్టోబర్ 2 నాటికి నూటికి నూరు శాతం ఎక్కడా చెత్త కనపడకూడదని మున్సిపల్ శాఖకు ఆదేశాలిచ్చాను. రోడ్డుపై ఒక్క కాగితం కూడా కనపడకుండా శుభ్రం చేస్తాము. నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చెత్తను సేకరించేందుకు సైకిళ్లు ఇచ్చి రెండు మూడు కిలోమీటర్లకు ఒక మనిషిని పెట్టాను. మైదుకూరు, పక్కనున్న పల్లెల్లో 12 కిలోమీటర్లలో రోడ్లు వేస్తాము.
మైదుకూరును ఒక మోడల్ గా తీసుకుని
మైదుకూరును ఒక మోడల్ గా తీసుకుని నూటికి నూరు శాతం వాటర్ ప్లాంట్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాము. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీరు అందిస్తాము. ఇందుకోసం రూ. 90 కోట్ల మంజూరు చేస్తున్నాము. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేరుస్తాం. సూర్య ఘర్ లో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను అవకాశాలు కల్పిస్తా మీరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇంటింటికీ నెట్, ఫోన్
ఇంటింటికీ ఇంటర్నెట్ ఉండాలి. సెల్ ఫోన్ ఉండాలి. ఈ నెలాఖరున వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెస్తున్నాను. కూటమి ప్రభుత్వ గెలుపుతో ఏపీకి మంచి రోజులు వచ్చాయి. కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్ధి బాట పట్టింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.