కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో గత నాలుగు రోజులుగా త్రీఫేస్ కరెంటు లేకపోవడంతో కంప్యూటర్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడం కీలకమైన ఎన్నికల తరుణంలో, విద్యార్థులకు పరీక్షల సమయంలో సిబ్బంది, అధికారులు పడుతున్న అవస్థలపై “కరెంటు కష్టాలతో కలెక్టరేట్ లో స్తంబించిన కార్యకలాపాలు…!” అన్న శీర్షికతో ఫిబ్రవరి 25న తెలుగు ప్రభ దినపత్రికలో ప్రచురించాం.
తెలుగుప్రభ వార్తకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేయడంతో స్పందించిన కలెక్టరేట్ కార్యాలయ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటిరోజు ఉదయం పది గంటలకే ఆగమేఘాల మీద జిల్లా రెవెన్యూ కార్యాలయానికి, విద్యాశాఖ కార్యాలయానికి త్రీ ఫేస్ కరెంటును పునరుద్ధరించారు.
ఈ ఘటనతో ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు స్పందించిన కలెక్టర్ కి, వార్తను వెలుగులోకి తెచ్చిన తెలుగుప్రభ యాజమాన్యానికి ప్రత్యేక అభినందలు తెలిపారు.