థియేటర్ల బంద్ నిర్ణయం వార్తలతో ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ ప్లాన్ చేయడంతో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ పెద్దలు దిల్ రాజు, అల్లు అరవింద్ మీడియా సమావేశం పెట్టి ఇందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
అయితే అసలు ఈ వివాదం అంతా తెరపైకి తెచ్చింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ అని దిల్ రాజు తెలిపారు. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది.

“అత్తి సత్యనారాయణ.. అవాంచనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజక వర్గం ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది” అని పేర్కొంది.