TTD Plans to Construct Temples in AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. టీటీవీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఆలయాలను నిర్మించనున్నట్లు ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశ అనంతరం వెల్లడించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఆలయాలను శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మతమార్పిడిలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృత చర్చ జరిగినట్లు వివరించారు. తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతోందని చెప్పారు. ఈనెల 23న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 24న మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుందని తెలిపారు. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజుల పాటు సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు బీఆర్ నాయుడు ప్రకటించారు. సెప్టెంబర్ 28న జరిగే గరుడసేవకు మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తుల సౌకర్యార్థం చిన్నారులు తప్పిపోకుండా జియో-ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. అంతకుముందు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యుల సమక్షంలో బ్రహ్మోత్సవాల బుక్‌లెట్–2025ని టీటీడీ ఛైర్మన్ విడుదల చేశారు.
Read Also: https://teluguprabha.net/sports-news/apollo-tyres-as-team-india-sponsor/
అందుబాటులోకి కొత్త వసతి భవనం..
ఇదిలా ఉంటే, తిరుమలకు నిత్యం సగటున లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నా.. వసతి సౌకర్యాలు మాత్రం పరిమితంగా ఉంటోంది. ప్రస్తుతం తిరుమలలో 45 వేల మందికి మాత్రమే వసతి అందుబాటులో ఉంది. మిగతా వారు హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు లేదా బయటే ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముందడుగు వేసింది. పిల్‌గ్రిమ్ అమెనిటీస్ కాంప్లెక్స్-5 ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త భవనానికి ‘వెంకటాద్రి నిలయం’ అని పేరు పెట్టింది. 2018లో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్మాణానికి నాంది పలికింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ భవనం తుది దశలో ఉంది. మొత్తం 102 కోట్ల రూపాయల ఖర్చుతో ఐదు అంతస్తుల ఈ భవనం సిద్ధమైంది. దీని ద్వారా దాదాపు 2500 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనుంది. అత్యవసర సమయాల్లో మరో 1000 మంది కూడా ఇక్కడ బస చేయవచ్చు.


