Vijayasai Reddy: జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని.. ఆ ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ శ్రేణులు ఇందుకోసం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓడిపోయామనే ఆందోళన చెందకుండా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. వైసీపీ నేతలకు జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
కాకినాడ పోర్టుకు సంబంధించి తనపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికాంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడతాయని హెచ్చరించారు. అవసరమైతే జైలుకు వెళ్తానని పోరాటం మాత్రం ఆపనని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గ్రామాల నుంచి తరిమేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితే లేదని.. వైసీపీ శ్రేణుల రక్తంలోనే భయమంటూ లేదన్నారు.