AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్(PAC Chairman) పదవికి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramchandra reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో.. కౌన్సిల్ నుంచి పీఏసీలో సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ సంస్థల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంచనాల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ సభ్యులను అసెంబ్లీ అధికారులు రెండు గంటల పాటు వెయిట్ చేయించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.