CM Jagan: కడప జిల్లా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. కానీ ఇప్పుడా వైఎస్ కుటుంబంపై జిల్లాలో గతంలో ఉన్న గౌరవం లేదు. కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ ఆవినాశ్ రెడ్డికి నియోజకవర్గంలో సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటనలో ఓ మహిళ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో.. నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా అయ్యో కడపలో వైఎస్ కుటుంబానికి ఎంత చెడ్డపేరొచ్చిందని అంటున్నారు.
అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కడపలో ఉన్న ప్రతిష్ట మసకబారడానికి ముఖ్యమంత్రి జగన్ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యే వరకూ కూడా ఉమ్మడి కడప జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగానే ఉంది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జిల్లాలో వైఎస్ కుటుంబంపై వ్యతిరేకత ప్రబలుతోందని జిల్లా వాసులే బహిరంగంగా అంటున్నారు.
2019 ఎన్నికలకు రోజుల ముందు వైఎస్ కు స్వయాన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆ రెండు కేసుల్లో ఇసుమంతైనా పురోగతి లేదు. పైపెచ్చు ఆ కేసుల్లో పురోగతి లేకుండా చేస్తున్నది స్వయానా జగనేనని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి విజయమ్మ.. సోదరి షర్మిల న పక్కన పెట్టారు. తను ముఖ్యమంత్రి కావడానికి వారు చేసిన కృషి, పడిన కష్టాన్ని జగన్ పూర్తిగా విస్మరించారు. జగన్ ధోరణితో విసిగి వారు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు.
ఇక జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా కుమార్తె సునీత తన సోదరుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం జరగడం లేదు, ప్రభుత్వమే ఈ హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందంటూ సుప్రీంకోర్టు మెట్లక్కడం.. వంటి సంఘటనలతో పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ప్రభ మసకబారుతోందని అంటున్నారు. వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. కిరాతక హత్య ఇంటి దొంగల పనేనంటూ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంతో జిల్లాలో వైఎస్ కుటుంబ అభిమానులు ఒక్క సారిగా ఆ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు.
ఇక జిల్లాల విభజనలో భాగంగా.. అన్నమయ్య జిల్లా ముఖ్య కేంద్రం రాజంపేట కాకుండా రాయచోటిని ఎంపిక చేయడంపై కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే సొంత బాబాయి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకే కాదు.. కోడికత్తి కేసును విచారిస్తున్న ఎన్ఐఏకు సైతం.. జగన్ ప్రభుత్వం సహకరించకపోవడంతో వీటి వెనుక ఉన్నది ఎవరో చూచాయిగానైనా అర్ధం చేసుకున్న కడప జిల్లా వాసులు జగన్ విశ్వసనీయత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అదీకాక.. ఉమ్మడి కడప జిల్లాలోని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని ఇప్పటికే ఓ నివేదిక జగన్ కు అందిందని చెబుతున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సొంత జిల్లా లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని నెటిజన్లు అంటున్నారు.