YS Sharmila criticizes AP govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల మానవత్వం లేదని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
పెన్షన్లు తొలగించడం ద్వారా దివ్యాంగుల జీవితాల్లో చీకట్లు నింపడం దారుణమని షర్మిల పేర్కొన్నారు. బోగస్ పెన్షన్లను గుర్తించడం మంచిదేనని, దొంగ సర్టిఫికెట్లు పొందిన వారిపై, వాటిని ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే, రీ-వెరిఫికేషన్ పేరుతో అర్హత ఉన్నవారిని కూడా అనర్హులుగా పరిగణించడం సరికాదని ఆమె అన్నారు. సుదీర్ఘకాలంగా పెన్షన్ పొందుతున్న వారిని సైతం అనర్హుల జాబితాలో చేర్చడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ రద్దుకు నోటీసులు అందుకున్న 1.20 లక్షల మందిలో ఎక్కువ మంది అర్హులే ఉన్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. తక్షణమే ఈ జాబితాను తిరిగి పరిశీలించాలని, అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేశారు. అర్హుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతున్నట్లు ఆమె తెలిపారు.


