వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లో తీసుకోవాలని కోరుతూ.. ప్లాంట్ ఎదుట ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు ఆమె తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకతతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు పలికారు.
కాగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల కొంతకాలంగా తన గళం బలంగా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్లాంట్ కార్మికులను కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అయినా కానీ యాజమాన్యం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులతో నిరాహార దీక్షకు దిగారు.