Eluru Police Facial Recognition Technology: నేరగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించే సరికొత్త అస్త్రం. సాంకేతికత సాయంతో పోలీసుల నిఘా నేత్రం. ఇకపై నేరం చేసి తప్పించుకోవడం అసాధ్యం! ఇంతకీ ఏంటా టెక్నాలజీ..? దాని పనితీరు ఎలా ఉంటుంది?
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరస్తులు తమ పంథాను మార్చుకుంటుంటే, వారిని మించిన వేగంతో దూసుకెళ్తున్నారు మన పోలీసులు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేరాల నియంత్రణకు, నేరగాళ్ల భరతం పట్టేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా పోలీసులు ప్రవేశపెట్టిన “ఫేస్ రికగ్నిషన్” టెక్నాలజీ సత్ఫలితాలనిస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక పాత నేరస్థుడిని చాకచక్యంగా పట్టుకుని, తమ సత్తా చాటారు.
కాకినాడ జిల్లాకు చెందిన పల్లి లక్ష్మణ్‌కుమార్ ఒక పాత నేరస్థుడు. అతనిపై జిల్లా వ్యాప్తంగా ఇళ్ల దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించి సుమారు 24 కేసులు నమోదై ఉన్నాయి. తనపై నిఘా పెరగడంతో, పోలీసుల కళ్లుగప్పి ఏలూరు జిల్లాకు మకాం మార్చాడు. అక్కడ తలదాచుకుంటూ తన పాత పద్ధతులను కొనసాగించాలని భావించాడు. అయితే, అతని ఎత్తులు ఏలూరు పోలీసుల “త్రినేత్రం” ముందు పారలేదు.
టెక్నాలజీ ఎలా పనిచేసింది : ఏలూరు జిల్లా పోలీసులు నేర నియంత్రణలో భాగంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో “ఫేస్ రికగ్నిషన్” ఫీచర్‌తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సిస్టమ్‌లో పాత నేరస్థుల ఫోటోలు, వారి పూర్తి డేటాను నిక్షిప్తం చేశారు.
ఒక రోజు పని నిమిత్తం లక్ష్మణ్‌కుమార్ ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాలకు వచ్చాడు. అక్కడి సీసీ కెమెరా అతని ముఖాన్ని గుర్తించి, వెంటనే పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని పంపింది. కెమెరా ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి, తమ రికార్డుల్లో ఉన్న పాత నేరస్థుడు పల్లి లక్ష్మణ్‌కుమార్ అని నిర్ధారించుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు.
వెంటనే ఒక కానిస్టేబుల్‌ను ఆ ప్రాంతానికి పంపగా, అప్పటికే లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, పోలీసుల వద్ద ఉన్న అతని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా, మొదట పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ఏలూరులోనే ఉన్నట్లు అంగీకరించాడు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీని కనుగొని, లక్ష్మణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/yadadri-power-plant-first-unit-inauguration-telangana/
ఈ సంఘటనతో ఏలూరు జిల్లాలో పాత నేరస్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. పోలీసుల నిఘా నేత్రం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, ఎక్కడ ఏ కెమెరా కంటపడతామోనని భయంతో వణికిపోతున్నారు.సాంకేతికతను సరైన రీతిలో వినియోగించుకుంటే నేరాలను ఎంత సమర్థవంతంగా నియంత్రించవచ్చోఏలూరు పోలీసులు నిరూపించారు.


