Mega DSC Chandrababu Naidu: రాష్ట్రంలో మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినందుకు గర్వంగా ఉందని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మందికి మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు అందజేశారు. వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత ఉందని వెల్లడించారు.
ఇకపై ప్రతి ఏడాది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టినట్లు గుర్తు చేసిన సీఎం.. ఇకపై అభ్యర్థులు ప్రిపేర్ అవుతూనే ఉండాలని సూచించారు. పారదర్శకంగా టీచర్ల నియామకం చేపట్టామని.. ‘బాబు షూరిటీ.. జాబు గ్యారంటీ’ హామీని నెరవేరుస్తున్నాం అని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలని నూతన ఉపాధ్యాయులకు సూచించారు.
“పిల్లల భవిష్యత్తు పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుంది. అందుకే విద్య విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మెగా డీఎస్సీ ఒక కీలక నిర్ణయం. సూపర్ సిక్స్ హామీల్లో మొదటిది మెగా డీఎస్సీ. నేను సీఎంగా చేసిన మొదటి సంతకం దీనిపైనే. ఉపాధ్యాయ నియామకాలు జరిగి, వేలాది మంది యువతకు ఉపాధి లభించడం గర్వకారణంగా ఉంది. ఈ నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేసిన లోకేశ్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.


