Pulivendula-TDP-YCp:పులివెందులలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ప్రభావం ఈసారి ముగిసింది. జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి చరిత్ర సృష్టించారు. ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిపై 6035 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. లతారెడ్డికి మొత్తం 6716 ఓట్లు రావగా, హేమంత్‌రెడ్డి కేవలం 683 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో వైసీపీకి డిపాజిట్ కూడా నిలుపుకోవడం సాధ్యం కాలేదు.
ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థులు 100 లోపు ఓట్లకే పరిమితమయ్యారు. మొత్తం 11 మంది పోటీ చేసిన ఈ ఉపఎన్నికలో 74 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక తొలి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6269 ఓట్లు సాధించి ముందంజలో ఉన్నారు, ఆయన ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి 3175 ఓట్లు పొందారు. ఇక్కడ మొత్తం 20,681 ఓట్లు పోలయ్యాయి.
జగన్‌కు ఎదురైన ఈ పరాభవం..
ఒకప్పుడు కంచుకోటగా భావించిన పులివెందులలో జగన్‌కు ఎదురైన ఈ పరాభవం చరిత్రలో నిలిచిపోనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రవేశం తర్వాత దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ వైఎస్ కుటుంబం ఏకపక్ష ఆధిపత్యం కొనసాగింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. ఎన్నికలు తొలిసారిగా ఘర్షణలేమి లేకుండా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగాయి. హింసా సంఘటనలు లేకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
సూపర్ సిక్స్…
కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సూపర్ సిక్స్ వంటి ప్రోగ్రాంలు ఓటర్లను ప్రభావితం చేశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నామినేషన్లు వేసిన 11 మందిలో ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల మధ్యే సాగింది. పోలింగ్ సమీపించేకొద్దీ వైఎస్సార్సీపీ లోకల్ నేతలకు ఓటర్ల ధోరణి స్పష్టమైంది. ఓటింగ్ రోజున కూడా ఆ పార్టీ ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ, పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో అశాంతి పరిస్థితులు తలెత్తలేదు.
లతారెడ్డి చరిత్రాత్మక విజయంతో..
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి చరిత్రాత్మక విజయంతో పులివెందులలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ ఎన్నికలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓటర్ల స్లిప్‌ల కట్టలు లెక్కిస్తుండగా, ఒక ఓటరు 30 ఏళ్ల తర్వాత ఓటు వేసినందుకు ఆనందంగా ఉందని రాసి పెట్టిన స్లిప్ బయటపడింది. ఇది అక్కడి ప్రజల రాజకీయ వాతావరణ మార్పుకు నిదర్శనంగా కనపడుతోంది.
విజయంతో ఉత్సాహంగా ఉన్న కూటమి శ్రేణులు కడప హరిత హోటల్ వద్ద సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు సవిత, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ, పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని, స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. ఆమె, రాబోయే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను కూడా చేధిస్తామని స్పష్టం చేశారు. లతారెడ్డి విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


