రక్షణ అనేదీ కేవలం మాటల్లో మాత్రమే మిగిలిపోయిందా.. ముఖ్యంగా యువతులు సురక్షితంగా ఉండాల్సిన హాస్టల్‌ల్లోనే ఇప్పుడు శాంతి కరువైంది. సైబర్ ముప్పులు, ఆకతాయి కళ్లెంలేని దుర్మార్గాల మధ్య యువతులు పగటి పూట చదువు, రాత్రిపూట భయం మధ్య కాలం గడుపుతున్నారు. ముఖ్యంగీ సీక్రెట్ కెమెరాలు.. తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి. తాజాగా గుంటూరులో చోటు చేసుకున్న సంఘటన ఇదే విషాదాన్ని మరోసారి రుజువు చేసింది.
గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో ఉన్న శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో చోటు చేసుకున్న సీసీ టీవీ వివాదం కలకలం రేపుతోంది. హాస్టల్‌లోని బాత్రూం ప్రాంతానికి సమీపంగా సీసీ టీవీ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఇందులో గోప్యత దెబ్బతినే పరిస్థితి ఉందని వారు భావిస్తున్నారు. ఇదంతా తెలిసిన వెంటనే వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతుల ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదులో మరో ఆసక్తికరమైన విషయమూ బయటపడింది. రాత్రివేళల్లో హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చిపోతున్నారని, హాస్టల్ సిబ్బంది ఈ విషయంపై స్పందించలేదని వారు తెలిపారు. దీంతో హాస్టల్ సురక్షితంగా లేదనే అనుమానాలు బలంగా వెలువడ్డాయి. ఈ కేసు ఆధారంగా అరండల్‌పేట పోలీసులు హాస్టల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల అమరిక ఎలా జరిగింది? ఎవరు వాటిని మానిటర్ చేస్తున్నారు? వాటి దృశ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి? వంటి కీలక కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
విద్యార్థినుల భద్రత విషయంలో ప్రస్తుత పరిస్థితులు తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తమ కుమార్తెలు చదువుల నిమిత్తం వెళ్లిన చోటే అసౌకర్యాలు, భయం అలుముకుంటే ఇక భవిష్యత్తు మీదే ప్రశ్నార్థకమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.