రాయలసీమ యూనివర్సిటీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను కలవరపాటుకి గురిచేస్తోంది. తెలుగుప్రభ పత్రికలో వస్తున్న వరుస కథనాలపై ఉన్నత విద్యా మండలితో పాటు జిల్లా యంత్రాంగం కూడా స్పందించి విచారణకు ఆదేశించడంతో క్యాంపస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.
భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే విద్యార్థుల ఆందోళనలు గత కొన్ని రోజులుగా వరుస కథనాల రూపంలో తెలుగుప్రభలో వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ప్రొఫెసర్ విద్యార్థులు చెల్లించిన లక్షల రూపాయల ఫీజులు కాజేశారని గత ఏడాది సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే పాలకమండలి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఒక్క రూపాయి కూడా రికవరీ లేకుండా తిరిగి ఆ ప్రొఫెసర్ కు బాధ్యతలు కట్టబెట్టడంతో ఆడిట్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఎలాగైనా తప్పు తన మెడకు చుట్టుకోకుండా ఇన్చార్జి వీసీ తూతూ మంత్రంగా ఆడిట్ నిర్వహించి విషయాన్ని సర్దుబాటు చేసేందుకు కుట్రలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఎన్టీకే నాయక్ పై ఎన్నో ఆరోపణలు..
26వ పాలకమండలిలో ప్రస్తుత వీసీగా కొనసాగుతున్న ప్రొఫెసర్ ఎన్ టి కే నాయక్ పలు హోదాల్లో వర్సిటీకి చెందిన కోట్ల రూపాయలు కాజేశారని విజిలెన్స్ విచారణకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పెద్ద కుంభకోణంతో పాటు విజిలెన్స్ విచారణను తొక్కి పెట్టేందుకు ఇదే అదనుగా భావించి అధికార పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడితో పాటు కొందరు ఎమ్మెల్యేలతో ఏకంగా ముఖ్యమంత్రి వద్దకే తన షాడోను పంపాడని విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. విజిలెన్స్ విచారణ నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని యూనివర్సిటీలో భారీగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి విషయాలపై విద్యార్థులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని గ్రహించిన ఇన్చార్జి వీసీ గత రెండు రోజులుగా రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ పరిధిలో సెక్యూరిటీనీ కట్టుదిట్టం చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు.
ఎం రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్
“వర్సిటీలో తూతూ మంత్రంగా ఆడిట్ నిర్వహించారు. నిజాలను కప్పి పెట్టేందుకే విజిలెన్స్ విచారణ గోప్యంగా చేపడుతున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడతాయని వర్సిటీలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి భారీకేడ్లు పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నత విద్యా మండలి చొరవ చూపి వీసీగా, రెక్టార్ గా కొనసాగుతున్న ఎన్ టి కే నాయక్ పైచర్యలు తీసుకోవాలి” అంటూ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం రాఘవేంద్ర డిమాండ్ చేశారు.