Godavari Floods: గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో 175 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం వద్ద గోదావరి నిండుకుండలా కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోదావరికి వరద నీరు పోటెత్తుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం గడియ గడియకు పెరుగుతుంది. ప్రస్తుతం 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమాయాత్తం చేసేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే లంక గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరింది. రోజురోజుకు గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు.


