ఛత్తీస్ గడ్ ఒరిస్సా సరిహద్దుల్లోని గరియాబాద్ జిల్లా కుల్హిగార్డ్ అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మావోయిస్ట్ అగ్రనేత చలపతి మృతి చెందటంతో శ్రీకాకుళంలో అలజడి నెలకొంది. చలపతి తన భార్య అరుణతో 2016 వ సంవత్సరంలో దిగిన సెల్పీనే తన మరణానికి దారితీస్తుందని చలపతి ఊహించి ఉండకపోవచ్చు. ఈ సెల్పీ తీసుకున్న ఫోను పోలీసులకు చిక్కటంతో లోకేషన్ ట్రేస్ చేసి… పక్క సమాచారంతోనే దాడి చేశారు. ఈ దాడుల్లో చలపతితో సహ మరో 27 మంది మావోలు మృతి చెందారు.
చలపతికి శ్రీకాకుళంకి ఉన్న అనుబంధం ఇదే..!!
చలపతి మృతికి శ్రీకాకుళంకి ఏంటి సంబంధం అనుకోవచ్చు. పీపుల్స్ వార్ పార్టీలో చలపతి కీలకపాత్ర పోషించారు. 1988 నుంచి 1994 వరకు ఉద్దాన ప్రాంతంలో చలపతి మావోయిస్టు పార్టీ కార్యక్రమాలను నడిపించారు. చలపతి మృతిలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పట్లో బొడ్డపాడు గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో చలపతి.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి అల్లుడయ్యాడు. పెళ్లి అయిన తర్వాత అరుణను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయారు.
సెల్పీతోనే చలపతి దొరికిపోయాడు..
ఇంత వరకు చలపతి ఎలా ఉంటాడనే విషయం పోలీసులకే తెలియదు. కానీ ఒక్క సెల్పీతో మెుత్తం బాహ్య ప్రపంచానికి చలపతి ఎవరో తెలిసిపోయింది. 2016లో భార్య అరుణతో చలపతి సెల్ఫీ తీసుకోగా ఆ చిత్రాన్ని ఆమె తన సోదరుడైన ఆజాద్ కు ఆమె పంపించింది. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మరణించగా భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్న ఆ సెల్ ఫోనులో చలపతి ఫోటో లభించింది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఆధారంగా లోకేషన్ ట్రేస్ చేసి పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని దాడి చేయటంతో చలపతితో సహా 27 మంది మరణించినట్లు సమాచారం.
చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిస్సా మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గిడ్డు, ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.