Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి, కొత్త శోభతో భక్తులకు స్వాగతం పలుకుతోంది. గత నెల రోజులుగా భక్తులకు దూరంగా ఉన్న స్వామి పుష్కరిణి బుధవారం నుంచి భక్తుల స్నానాలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పుష్కరిణి ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా మారింది.
పుష్కరిణికి కొత్త రూపు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వామి పుష్కరిణి మరమ్మతు పనులను చేపట్టారు. జూలై 20న ప్రారంభమైన ఈ పనులలో భాగంగా, పుష్కరిణిలోని పాత నీటిని పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత అడుగు భాగంలో పేరుకుపోయిన ఇసుక, పాచిని తొలగించి పూర్తిగా శుభ్రం చేశారు. కొత్త రంగులు ,వేసి మెట్లను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల కొత్త నీటితో పుష్కరిణిని నింపి, పూర్తిగా సిద్ధం చేశారు. ఈ పనుల కారణంగా గత నెల రోజులుగా నిలిపివేసిన పుష్కరిణి హారతి, భక్తుల స్నానాలకు తిరిగి అనుమతించారు.
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పది రోజుల పాటు తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోనుంది. సెప్టెంబర్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ సేవ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్టోబర్ 1న రథోత్సవం, అక్టోబర్ 2న చక్రస్నానం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
సెప్టెంబర్ 16: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబర్ 23: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబర్ 24: ధ్వజారోహణం (మొదటి రోజు)
సెప్టెంబర్ 28: గరుడ వాహనం (ఐదో రోజు)
అక్టోబర్ 1: రథోత్సవం (ఎనిమిదో రోజు)
అక్టోబర్ 2: చక్రస్నానం (చివరి రోజు)
బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ కొన్ని దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా ఈ పది రోజులు రద్దు అవుతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వివిధ వాహనాలపై శ్రీవారి ఊరేగింపు జరగనుంది.


