ఆకాంక్షిత జిల్లాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వైఎస్ఆర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం “నీతీ ఆయోగ్” (niti aayog)ద్వారా అత్యుత్తమ పురస్కారంతో రూ. 3 కోట్లను కేటాయించిందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుక్రవారం తెలిపారు.
ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో ఫిబ్రవరి 2024 వరకు ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను శుక్రవారం జిల్లాకు రూ. 3 కోట్ల నగదు పురస్కారాన్ని నీతీ ఆయోగ్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 112 ఆకాంక్షిత జిల్లాల్లోని 36 జిల్లాలకు ఈ అత్యుత్తమ పురస్కారాన్ని నీతీ ఆయోగ్ ప్రకటించగా అందులో వైఎస్ఆర్ జిల్లా కూడా ఒకటిగా పురస్కారాన్ని అందుకోవడం గర్వించదగ్గ విషయం అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు.
జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, బ్యాంకింగ్ యాక్సెస్‌ను విస్తరించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు విస్తృతంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఈ పురస్కారం జిల్లాను వరించింది. కాగా.. ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతం చేయడం, సామాజికంగా శక్తివంతం చేయడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ, జిల్లా పరిపాలన యంత్రాంగం నిబద్ధత.. ఈ ప్రతిభా పురస్కారానికి ప్రధాన తార్కాణంగా చెప్పవచ్చు.
అంతేకాకుండా జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా వినూత్న వ్యూహాలతో చురుకైన పాలన సాగించడం వంటి ఫలితాల కారణంగానే ఈ విజయం సాధ్యమైంది.
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి నాయకత్వంలో జిల్లా ఆర్థిక రాబడులను పెంచే లక్ష్యాలను నిర్దేశించుకుని, అన్ని రంగాల్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం నీతీ ఆయోగ్ ద్వారా ప్రకటించిన రూ. 3 కోట్ల కేటాయింపును జిల్లాలోని యువతకు ఉపాధి కల్పన, యువ పారిశ్రామిక వేత్తల (స్టార్టప్) లను, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి సద్వినియోగం చేయడం జరుగుతుంది.
జిల్లా ఆర్థిక ప్రగతిలో.. నీతీఆయోగ్ అవార్డు ఒక మైలురాయిగా, ప్రేరణగా గుర్తింపు నిచ్చింది. రానున్న రోజుల్లో జిల్లాలో సామాజిక, ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి జిల్లా యంత్రాంగం అంకితభావంతో పనిచేసేందుకు జిల్లాను సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి వైపు పురోగమనంలో ముందుకెళ్లడానికి తోడ్పడనుంది.