కలశ ఫౌండర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా ఐకాన్ అవార్డు అందుకున్నారు డా. కలశనాయుడు.
అంతర్జాతీయ స్థాయిలో సామాజిక సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కలశ ఫౌండేషన్ కు అరుదైన గుర్తింపు, గౌరవం లభించింది. కలశ ఫౌండేషన్ ద్వారా డా. కలశనాయుడు మేడపురెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఆ చిన్నారిని ఆసియా ఐకాన్ 2024 అవార్డు వరించింది.
ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పదకొండేళ్ల వయసులో సాటి మనుషుల పట్ల ఆ చిన్నారి చూపుతున్న కరుణ, దయార్ధ హృదయానికి అంతర్జాతీయ అవార్డు సైతం సలాం అంది. అందుకే, ఉపఖండంలోని ప్రముఖులందరూ ఏళ్ల తరబడి ఎదురు చూసినా దక్కని ప్రిస్టేజియస్ అవార్డు పదకొండేళ్లు కూడా నిండని చిన్నారి డా. కలశనాయుడుకు దక్కింది. అత్యంత చిన్న వయసులోనే సోషల్ సర్వీస్ కేటగిరీలో ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఆసియా ఉపఖండ వాసి, అంతేకాదు ఆసియా ఐకాన్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయురాలు కూడా కలశనాయుడు కావడం మరో అరుదైన రికార్డులు.
కొలంబోలో అవార్డు ప్రదానం..
ఆసియా ఐకాన్ 2024 అవార్డుల ప్రదాన కార్యక్రమం ఈనెల 26, 27 తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వివిధ కేటగిరీల్లో ఆసియా ఖండంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి వ్యక్తికి, సంస్థనూ ఆసియా ఐకాన్ 2024 పురస్కారం లభించింది. గ్లోబల్ సోషల్ సర్వీస్ కేటగిరిలో కలశ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, గ్లోబల్ యంగెస్ట్ సోషల్ వర్కర్ డా. కలశనాయుడు మేడపురెడ్డికి ఆసియా ఐకాన్ 2024 అవార్డు లభించింది.
కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదగా డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, సర్టిఫికెట్ను కూడా కలశనాయుడు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలశ తల్లిదండ్రులు డా. నూతననాయుడు, డా. ప్రియా నాయుడు పాల్గొన్నారు. తమ కుమార్తె ఆసియా ఐకాన్ 2024 అవార్డు అందుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కలశమ్మకు చిన్ననాటి నుండి సమాజ సేవ పట్ల ఎంతో ఆసక్తి ఉండేదని, అది గుర్తించిన తాము ఎంకరేజ్ చేశామని వారు చెప్పారు. పిల్లలకు ఏ రంగం పట్ల ఆసక్తి ఉందో తల్లిదండ్రులు చిన్నప్పుడే గుర్తించి, ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించినప్పుడు వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారని కలశనాయుడు తండ్రి డా. నూతననాయుడు అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రులుగా కలశ ఇష్టాన్ని ప్రోత్సహించాం. తాను కూడా సమాజసేవ పట్ల ఎంతో నిబద్ధతతో పని చేస్తోంది. కలశ సేవాతత్పరతను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి గౌరవ డాక్టరేట్ పురస్కారంతో పాటు గ్లోబల్ యంగెస్ట్ సోషల్ వర్కర్గా గుర్తించిందని ఆయన వెల్లడించారు.