ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర అయిన నాగోబా జాతర(Nagoba Jatara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివాసీలు, గిరిజనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు.
“వనమే ఆలంబనగా అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలు అందరు జరుపుకునే వేడుక “నాగోబా జాతర”. గిరిజన సోదర, సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణ సాంస్కృతిక వైభవం. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుకలో ఆధ్యాత్మక వెలుగులు నింపే ఆదిశేషువు కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.” అని ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నాగోబా జాతరను ఆదివాసీ, గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్లో ఈ జాతర వైభవంగా జరగనుంది. ఈ మేరకుప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 మంది పోలీసులు,100 సీసీ కెమెరాల నడుమ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక ఈ జాతరకు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.