Low-cost portable homes in Sangareddy : “ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు” అనే సామెత ఇక పాతబడిపోయినట్లే. ఎందుకంటే, ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఏళ్లూ పూళ్లూ అవసరం లేదు. ఇటుక, ఇసుక, సిమెంటుతో పనిలేదు. ఆన్‌లైన్‌లో నచ్చిన వస్తువును ఆర్డర్ చేసినంత సులభంగా, మన కలల ఇంటిని ఆర్డరిస్తే చాలు… రోజుల వ్యవధిలోనే దాన్ని మన పెరట్లో పెట్టేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ అద్భుతం..? ఎక్కడికీ కావాలంటే అక్కడికి తీసుకెళ్లగలిగే ఈ కదిలే ఇళ్ల కథేంటి..?
ఈ సరికొత్త గృహ నిర్మాణ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది సంగారెడ్డి జిల్లా. జిల్లా కేంద్ర శివారులోని కంది, రుద్రారం, పటాన్‌చెరు వంటి ప్రాంతాలలో ఈ ‘పోర్టబుల్ హౌస్’ల తయారీ ఒక పరిశ్రమగా వర్ధిల్లుతోంది. ఇక్కడ తయారవుతున్న ఇళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సైతం తరలివెళ్తున్నాయంటే వీటి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎలా నిర్మిస్తారు – ఏమేం ఉంటాయి : సాంప్రదాయ నిర్మాణ పద్ధతులకు పూర్తి భిన్నంగా, తక్కువ ఖర్చుతో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు.
నిర్మాణ వస్తువులు: ప్రధానంగా నాణ్యమైన చెక్క, అత్యంత దృఢమైన షిప్పింగ్ కంటెయినర్లను ఉపయోగించి ఈ ఇళ్లను రూపొందిస్తున్నారు. ఇటుక, ఇసుక, కంకర వంటి వాటితో అసలు పనే లేదు.
సకల సౌకర్యాలు: సాధారణ ఇళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని వసతులూ కల్పిస్తున్నారు. అందమైన కిచెన్, విశాలమైన హాలు, సౌకర్యవంతమైన పడక గది, ఆధునిక శైలి మరుగుదొడ్లు… ఇలా అన్నీ ఉంటాయి. కస్టమర్ అభిరుచికి తగినట్లుగా ఫ్లోరింగ్‌కు టైల్స్ కూడా వేసి ఇస్తారు.
మనకు నచ్చినట్టు: సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్, డూప్లెక్స్… ఇలా మనకు ఏ నమూనాలో కావాలంటే ఆ నమూనాలో, మన బడ్జెట్‌కు తగినట్టుగా నిర్మించి ఇస్తున్నారు. ఇంటి కింద వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ఎందుకింత ఆదరణ: ఈ కదిలే ఇళ్లకు అనూహ్యంగా ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి.
ఫామ్‌ల్యాండ్ ట్రెండ్: హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఫామ్‌ల్యాండ్‌లు కొనుగోలు చేసి, వారాంతాల్లో సేద తీరాలనుకునే వారికి ఇవి వరంలా మారాయి. లక్షలు ఖర్చుపెట్టి శాశ్వత నిర్మాణాలు చేపట్టే బదులు, తక్కువ ఖర్చుతో ఈ పోర్టబుల్ ఇళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ అవసరాలు: రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లలో తాత్కాలిక క్యాంపు ఆఫీసుల కోసం వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వెంచర్ పూర్తవగానే ఆఫీసును సులభంగా మరో చోటికి తరలించుకుపోతున్నారు.
తరలించే సౌలభ్యం: ఈ ఇళ్లలో అతి పెద్ద ఆకర్షణ ‘పోర్టబిలిటీ’. భవిష్యత్తులో మన స్థలాన్ని అమ్మేయాల్సి వచ్చినా, ఇంటిని మాత్రం నష్టపోనక్కర్లేదు. ఇంటిని మరో చోటికి తరలించుకోవచ్చు. సంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని నాలుగు కేంద్రాలలో పదుల సంఖ్యలో కార్మికులు ఈ ఇళ్ల తయారీలో నిమగ్నమై ఉపాధి పొందుతున్నారు. రోజుకు 10 నుంచి 15 ఇళ్లను విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచి, ఆకృతి, సౌకర్యాలను బట్టి వీటి ధరలు మారుతుంటాయి. మొత్తం మీద, తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తరలించే సౌకర్యం అనే మూడు ప్రధాన కారణాలతో ఈ పోర్టబుల్ ఇళ్లు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సులభంగా నెరవేరుస్తున్నాయి.


