అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా యశోదా ఆసుపత్రిలో విజయవంతంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ మార్పిడి చేసుకుని పునర్జన్మ పొందిన 35 మందికిపైగా పేషెంట్లతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని యశోదా ఆసుపత్రి నిర్వహించింది. అవయవదానంతో చివరి దశలో ఉన్న రోగులకు సరికొత్త జీవితం లభిస్తోందని యశోదా ఆసుపత్రి వెల్లడించింది. సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది యశోదా ఆసుపత్రి. ట్రాన్స్ ప్లాంట్ కు ముందు, తరువాత వారు అనుభవించిన ఆరోగ్య సమస్యలు, జీవన శైలిలో మార్పులు వంటి న్ని విషయాలపై ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నవారు సవివరంగా వెల్లడించారు. దీంతో ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలనుకున్న రోగుల అపోహలు, అనుమానాలను యశోదా వైద్యులు ప్రయోగాత్మకంగా తీర్చారు. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఈమేరకు యశోదా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ముఖ్య అతిథిగా హాజరై రోగుల అవగాహన కోసం అవయవదాన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ మాట్లాడుతూ..ఏటా 3 లక్షల మందికిపైగా రోగులు అవసరమైన అవయవాలు లభించక మరణిస్తున్నారన్నారు. బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించిన వయవాల దానం ఈమధ్యనే 0.36 శాతం నుంచి 1 శాతానికి పెరిగిందన్నారు. మన రాష్ట్రంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉందని ఆయన వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా ప్రతీ 10 లక్షల జనాభాకు ఐదుగురు మన రాష్ట్రంలో అవయవదానం చేస్తున్నారన్నారు. మన రాష్ట్రానికి చెందిన జీవన్ దాన్ దేశంలోనే క్రియాశీల కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, రాష్ట్రంలో క్రమంగా అవయవదానాల సంఖ్య పెరుగుతోందన్నారు. ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా ఆయుష్షును పెంచే రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఈ సర్జరీలతోనే హైదరాబాద్ సిటీ దేశంలోనే ప్రధాన నగరంగా మారిందన్నారు.
యశోదా ఆసుపత్రి సికింద్రాబాద్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ..ఈమధ్యకాలంలో చాలా మంది పేషెంట్లు చివరి స్టేజ్ ఊపిరితిత్తుల వ్యాధి లేదా టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న అనేకమంది రోగులు యశోదా ఆసుపత్రిలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంట్ లో థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ తో సరికొత్త జీవితం పొందారన్నారు. మన రాష్ట్రం అవయవదానంలో, మార్పిడిలో తొలి స్థానంలో ఉన్నా చాలామంది ఆర్గాన్ వెయిటింగ్ లిస్టులో ఉన్నారని ఆయన వివరించారు.