Thomas Kurian Google Cloud CEO Success Story: ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టాల సుడిగండాలను దాటి విజయ శిఖరాన్ని చేరుకున్న నాడు.. ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అలాంటి విజేతల స్టోరీలు మనకు కన్నీళ్లు తెప్పించడమే కాదు.. మన జీవిత గమ్యానికి దిశానిర్దేశం. నాడు కేఫ్‌లో వెయిటర్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు గూగుల్ క్లౌడ్ సీఈఓ స్థాయికి చేరుకున్న థామస్ కురియన్ కథ కూడా అలాంటిదే. ఆయనకు ఆ విజయం ఊరికే దక్కలేదు. ఆయన సక్సెస్ వెనుక ఉన్న స్టోరీ తెలుసుకుందాం..
విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు ప్రకటన తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు థామస్ కురియన్.. ఎవరీయన.? ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నత విద్యావంతులకు జన్మించారు. కేరళలోని కొట్టాయం జిల్లా పాంపడికి చెందిన థామస్ కురియన్.. నేడు విశాఖలో గూగుల్ ఏఐ హబ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి కెమికల్ ఇంజినీర్, తల్లి టీచర్ కావడంతో చిన్నప్పటి నుంచే చదువు అంటే ప్రేమ, క్రమశిక్షణ అంటే విలువగా భావించారు.
థామస్, జార్జ్ కురియన్ కవల సోదరులు. చిన్న కుటుంబంలో జన్మించినా.. ఆయన ఆలోచనలు పెద్దవిగా ఉండేవి. తల్లిదండ్రుల పెంపకంలో జ్ఞానం పట్ల ఆసక్తిని, ప్రపంచాన్ని తెలుసుకునే తపన కారణంగా.. ఇద్దరూ చదువులో ఎల్లప్పుడూ ముందుండేవారు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదివేటప్పుడే.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఐఐటీ మద్రాస్‌లో అడ్మిషన్ పొందారు. ఆ తర్వాతే వారి జీవితం మలుపు తిరిగింది.
అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో థామస్, జార్జ్ అడ్మిషన్ పొందారు. దీంతో చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా ఐఐటీ చదువును మధ్యలో వదిలి అమెరికాకు వెళ్లారు. అమెరికాలో తొలినాళ్లలో కేఫ్‌లో వెయిటర్‌గా, కార్ పార్కింగ్ లాట్‌లో అటెండర్‌గా పనిచేశారు. చదువుతో పాటు జీవన పోరాటాన్ని సమానంగా నడిపించారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి థామస్ ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం తన కెరీర్‌ను మెకెన్సీ అండ్ కంపెనీతో ప్రారంభించి ఆరేళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఒరాకిల్‌లో దాదాపు 22 సంవత్సరాలు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.
Also Read: https://teluguprabha.net/national-news/central-govt-retirement-age-hike-rumor-pib-fact-check/
చిన్న వయసులోనే థామస్ 32 దేశాల్లో 35,000 మందికి పైగా ఉద్యోగులను టీమ్ లీడ్‌గా పనిచేశారు. ఆ సమయంలో అంతర్జాతీయ వ్యూహాలు, టెక్నాలజీ అభివృద్ధి, వ్యాపార దృక్పథంలో ఆయన చూపిన స్ఫూర్తి ఆయనను పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నాయకుడిగా నిలిచేందుకు దోహదపడ్డాయి. 2018లో ఒరాకిల్ కో ఫౌండర్‌తో విభేదాల తర్వాత బయటకు వచ్చిన థామస్ గూగుల్ క్లౌడ్ విభాగంలో సీఈఓగా నియమితులయ్యారు. థామస్ నాయకత్వంలో గూగుల్ క్లౌడ్ సర్వీసులు వేగంగా ఎదిగాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది సంస్థలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తున్నాయి.
కేవలం వ్యాపార సూత్రమే కాకుండా టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో పనిచేసిన థామస్.. గూగుల్ ఏఐ హబ్‌ల స్థాపనలో కీలక పాత్ర వహించారు. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ద్వారా భారత యువతకు కృత్రిమ మేధా (AI) రంగంలో శిక్షణ, పరిశోధన, మరియు ఉద్యోగ అవకాశాలతో థామస్ పేరు విశ్వవ్యాప్తమైంది.
ఆయన ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు.. ‘జీవితం మీకు అవకాశాలు ఇవ్వకపోయినా.. మీకు మీరే సృష్టించుకోవాలి అని..’ ఆ గెలుపు సూత్రమే, థామస్ కురియన్ పట్టుదల, నిబద్ధత, కష్టపడే తత్వమే.. ఈ రోజు సాధారణ కుటుంబం నుంచి గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి నిదర్శనం. ఆ ఫలితమే నేడు ఆయన నికర సంపద రూ.15 వేల కోట్లకు పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. కాగా, థామస్ కవల సోదరుడు జార్జ్ కురియన్ ప్రస్తుతం నెట్‌యాప్ సంస్థకు సీఈఓ.


